జమ్మూ కాశ్మీర్ లోని నియోజకవర్గాల విభజన అంశం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగం పరిధిలో శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్, సంబంధిత ప్రక్రియ చెల్లుబాటును ప్రశ్నిస్తూ శ్రీనగర్ వాసులు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం విచారించింది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేయడంపై పెండింగ్ లో ఉన్న పిటిషన్ల విచారణపై తాజా తీర్పు ప్రభావం ఉండదని పేర్కొంది.
నిజయోకవర్గాల పునర్విభజన ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా చేశారన్నది ప్రతిపక్షాల ఆరోపణగా ఉంది. 2026కి ముందు దేశంలో ఎక్కడా కూడా నియోజకవర్గాల పునర్విభజన చేయడం కుదరదని, కనుక ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కింద చెల్లుబాటు కాదని పిటిషనర్లు హాజి అబ్దుల్ ఘని, మహమ్మద్ అయూబ్ మట్టో పేర్కొన్నారు. దేశంలో నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ప్రకారం చేశారని, 2026 వరకు దీన్ని మార్చడానికి లేదని వాదించారు. 2019లో పార్లమెంటులో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం కింద డీలిమిటేషన్ కమీషన్ ను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ గతేడాది మేలోనే పూర్తి కావడం గమనార్హం. నూతన జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 114 సీట్లు ఉంటాయి. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ కు 24 స్థానాలు కేటాయించారు. ఇవి పోను 90 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో జమ్మూ ప్రాంతానికి 43 ఇవ్వగా, కశ్మీర్ ప్రాంతానికి 47 కేటాయించారు.