మంగళగిరి పట్టణంలోని మంగళాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కల్యాణ పుష్కరిణి (పెదకోనేరు)పై వైసీపీ పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెదకోనేరు పునరుద్ధరణ పనుల్లో భారీ అవినీతి జరుగుతుందని టీడీపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టీడీపీ నేతల ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సంయమనం కోల్పోయిన మల్లేశ్వరరావు పెదకోనేట్లో ఎలాంటి నిధి నిక్షేపాలు లేవని.. కేవలం నిరోధ్లు, ఇంజక్షన్ బుడ్డీలు మాత్రమే వున్నాయని, కోనేరు అడుగు భాగాన వున్న బురదను ఆత్మకూరు వద్ద గల నాలుగుకాళ్ల మండపంవద్ద వేస్తున్నామన్నారు. పవిత్రమైన శ్రీవారి కల్యాణ పుష్కరిణి పై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై పలువురు భక్తులు, పట్టణ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ మునగాల భాగ్యలక్ష్మీ, వైసీపీ నేతలు ఆకురాతి రాజేష్, సంకె సునీత, మల్లవరపు సుధారాణి, మహమ్మద్ ఫిరోజ్, సంకా బాలాజీగుప్తా తదితరులు పాల్గొన్నారు.