ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్కు రాష్ట్ర ప్రజలు రెండో చాన్స్ ఇవ్వరని గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సోమవారం రాత్రి పిడుగురాళ్ల మండలం చినఅగ్రహారంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి... గురజాలకు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధులలో యరపతినేని పర్యటించి నాలుగేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని జగన్ అన్నారు. అన్ని ధరలు పెరిగిపోవడం, పంట ధరలు దిగిపోవడంతో రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. గ్రామాలలో తెలుగుదేశం పాలనలో మౌలిక వసతులు కల్పిస్తే జగన్ పాలనలో చెత్తపన్నుతో అధిక ఆదాయం పొందుతున్నారన్నారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అన్నివిధాల సర్వనాశనం చేస్తూ, వ్యవస్థలను గాడితప్పేలా చేయడంలో ఘనుడన్నారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్కు రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికలలో చుక్కలు చూపించనున్నారన్నారు.