వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోన్ రె్డ్డి అందుకు తగ్గటుగా పార్టీ పరిస్థితిని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గడప గడపకూ కార్యక్రమం అత్యంత కీలకమని.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే.. నష్టపోయేది ఎమ్మెల్యేలే అని వార్నింగ్ ఇచ్చారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు, నేతలను జగన్ మందలించారు. ముఖ్యంగా వారిలో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు వెనుక బడినట్లు జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. వెంటనే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఈ కార్యక్రమం నిర్వహణలో బాగా వెనుకబడి ఉన్నారని జగన్ వెల్లడించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లక్ష్యం మేరకు పూర్తి చేయడంలో వెనుకబడ్డారని.. ఇకనుంచి ఇలాంటి పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు.
ఇటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇంతవరకు ప్రారంభించలేదు. రెండో విడతలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెనుకంజలో ఉన్నట్లు సీఎం జగన్ ప్రస్తావించారు. గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహణలో వెనుకబడినా.. అలసత్వం ప్రదర్శించినా వచ్చే ఎన్నికలలో పార్టీ టిక్కెట్ ఉండదని జగన్ మరోసారి హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మొత్తం పూర్తిచేసి ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నట్లు జగన్ చెప్పారు.
విజయవాడ తూర్పులోనూ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ లక్ష్యం మేరకు పూర్తి చేసినట్లు జగన్ అభినందించారు. నియోజకవర్గాల్లో వార్డు కన్వీనర్లు, గృహసారథుల నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని.. శిక్షణ ఇవ్వాలని అధినేత ఆదేశించారు. మార్చి 18 నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని తీసుకుని.. 10 రోజుల పాటు విస్తృతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తరపున ఆయన తనయుడు పేర్ని కిట్టు ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ ఆయన పేరు మాత్రం ప్రస్తావించలేదు. ఇటు మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో లక్ష్యం మేరకు తిరగుతున్నట్లు నమోదయ్యింది. మళ్లీ సమావేశం వరకు అందరి పనితీరులో మార్పు రావాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.