ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి మా ప్రభుత్వ ధ్యేయం: అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 07:33 PM

మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన తేల్చిచెప్పారు. 


మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వం విధానమని.. దీనికి కారణం సమతుల్యమేనని మంత్రి అంబటి తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా చూసుకోవాలనేదే తమ భావన అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ఇంతకు ముందు చాలా అనుభవాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో రీజనల్ ఫీలింగ్స్ ఉన్నాయని పేర్కొన్నారు.


ఒక ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల ఒకసారి దెబ్బతిన్నామని.. తెలంగాణ ఫీలింగ్‌తో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వంటి గొప్ప ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి అంబటి పేర్కొన్నారు. ఆనాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే అన్ని చోట్లా అభివృద్ధి జరగాలనే సదుద్దేశంతో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


మూడు రాజధానులు ఉంటే ఒకటి రాయలసీమకు, మరొకటి కోస్తాంధ్రకు, ఇంకొకటి ఉత్తరాంధ్రకు ఇ‍చ్చి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడంతో పాటు, ఓన్ చేసుకునేలా ఉంటుందని మంత్రి అంబటి చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఆందోళన, అభద్రతా భావం ఏ ప్రాంతానికీ ఉండకూడదనే సదుద్దేశంతో మూడు రాజధానులు ఏర్పాటు చేశామని.. అదే తమ పాలసీ అన్నారు. 3 రాజధానుల పాలసీకే తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. దీని గురించి ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com