పర్యాటక శాఖ మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు రోజా కౌంటర్ ఇవ్వగా.. మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలు రోజా ఇంటికెళ్లారు. దీంతో కొందరు టీడీపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలు రోడ్డెక్కారు. ఖబర్దార్ లోకేష్.. పాదయాత్రను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
మంత్రి రోజా ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు చీరలు.. గాజులు తీసుకురావడంపై వైసీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాక్ టవర్ వద్దకు చేరుకొని.. నారా లోకేష్ నగరి నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ భాను ప్రకాష్ చిత్రపటాలను చీపుర్లతో, చెప్పులతో కొట్టి.. నిరసన వ్యక్తం చేశారు. 'మంత్రి రోజా ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో.. పసుపు చీర పంపడం ఏంటి. సరిగా తెలుగు కూడా రాని నేత లోకేష్. రోజాపై అవాకులు.. చవాకులు పేలితే బాగుండదు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు మా రోజాపై గెలిచి చూపాలి. నగిరి నియోజకవర్గంలో భాను ప్రకాష్‌ని కాలు కూడా పెట్టనీయం' అని వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు మేరీ జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.