ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు కోసం ఏపీ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అద్భుతమైన రుచి.. మైమరిపించే మాధుర్యం ఆత్రేయపురం పూతరేకుల సొంతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన ఆత్రేయపురం పూతరేకులకు.. వాణిజ్య పరిశ్రమల శాఖ జారీ చేసే భౌగోళిక గుర్తింపు కోసం జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు.. వైజాగ్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ సహకారంతో జీఐ గుర్తింపు కోసం చేసుకున్న దరఖాస్తుకు సంబంధించి పరిశీలనలు పూర్తయ్యాయి.
వాణిజ్య పరిశ్రమల శాఖ ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్‌లో.. ఆత్రేయపురం పూతరేకుల ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇచ్చారు. చెన్నై కేంద్రంగా ఉన్న జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం.. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులు, కళలు, ఆహార ఉత్పత్తుల గుర్తింపు కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి.. ఆ తరువాత అభ్యంతరాల కోసం ప్రకటన జారీ చేస్తుంది. ఎవరి నుంచీ అభ్యంతరాలు రాకుంటే.. జీఐను నమోదు చేస్తుంది. ప్రస్తుతం పూతరేకుల గుర్తింపు అంశం ప్రకటన వరకు వచ్చింది. త్వరలో జీఐ సాధిస్తామని.. సహకార సంఘం ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.