మనదేశంలో అంబులెన్స్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇందుకు ఎన్నో ఫోటోలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. తాజాగా బిడ్డ మృతదేహంతో తల్లిదండ్రులు ఆస్పత్రి నుంచి 120 కి.మీ. దూరం స్కూటీపై ప్రయాణించారు. ఈ హృదయవిదారక ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. కుమడకు చెందిన దంపతులకు కొన్ని రోజుల కిందట ఓ శిశువు జన్మించింది. ఆ బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందింది. స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆస్పత్రి వర్గాలను ఆ దంపతులు కోరారు. అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేక స్కూటీపైనే బయల్దేరి వచ్చినట్లు వారు చెబుతున్నారు.
120 కి.మీ. దూరం ప్రయాణించి పాడేరు చేరుకున్నారు. బిడ్డ మృతదేహాన్ని స్కూటీపై తీసుకొస్తున్న విషయం పాడేరు ఆస్పత్రి వర్గాల దృష్టికి రావడంతో వారు అక్కడ నుంచి స్వగ్రామం కుమడకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో అంబులెన్స్‌లో బిడ్డను తరలించారు.
మృతి చెందిన బిడ్డతో తల్లిదండ్రులు స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేజీహెచ్ ఆస్పత్రి వర్గాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ విషయం తన దృష్టికి రాలేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. అంబులెన్స్‌ను నిరాకరించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఘటనపై అంతర్గత దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు చెబుతామన్నారు. మరోవైపు.. కేజీహెచ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.