వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీ, టీడీపీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ ముందుకుసాగుతున్నాయిఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోటీగా మరో కొత్త వ్యవస్థకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థకు మరో పోటీ వ్యవస్థ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు దేశం పార్టీలో ‘కుటుంబ సాధికార సారథుల’ పేరిట కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం 50 కుటుంబాలకు ఓ వాలంటీర్‌ను నియమిస్తే.. తాము ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథులను నియమించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు.. జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని వ్యాఖ్యానించారు. ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్‌ఛార్జ్‌లందర్నీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పని చేస్తారని పేర్కొన్నారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని వివరించారు. ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.