ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముసునూరు మండలం గుడిపాడులో ఇటుక ఫ్యాక్టరీలో శనివారం ప్రమాదవశాస్తు ట్రాక్టర్ బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రైతు పిల్లి గంగారామ్ భూమిని పి. కృష్ణారావు అనే వ్యక్తి లీజుకు తీసుకుని ఐదేళ్ళుగా ఇటుక ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఏఎస్ఆర్ నగర్‌కు చెందిన ఆకుల రమేష్ కుటుంబ సమేతంగా 4 నెలల క్రితం ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇటుక తయారీకి ఉపయోగించే మట్టిని దమ్ము చక్రాల ట్రాక్టర్‌తో తొక్కి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాస్తు ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలో ఆకుల రమేష్ (26) తల, మెడ భాగాలను స్టీరింగ్ నొక్కివేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి గర్భవతైన భార్యతో పాటు తల్లి, అక్కచెల్లెళ్ళు ఉన్నారు. తమకు దిక్కెవరని వీరంతా కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. సంఘటనా స్థలికి చేరిన పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎం.కుటుంబరావు తెలిపారు.