పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తాము నష్టపోతున్నామని తెలిసి రాష్ట్ర భవిష్యత్ కోసం ఉన్న ఊరిని, భూములను ఖాళీ చేసేందుకు ఏడు మండలాల ప్రజలు గుండెలు భారమెక్కుతున్నా దిగమింగుకుని సంసిద్దత వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత భూములకు సముచితమైన ధరను నిర్ణయించి ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున చెల్లించి భూసేకరణ నిర్వహించింది. అదే క్రమంలో 2017లో నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు సర్వే చేపట్టింది. ఒక్కొక్క కుటుంబానికి గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు, గిరిజనులకు రూ.6.86 లక్షలుగా వ్యక్తిగత కుటుంబ ప్యాకేజీనీ ప్రకటించింది. 2013 నూతన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు రెండింతలు కలిపి భూ నష్టపరిహారం చెల్లించగా నిర్వాసితుల గృహాలకు ఒక ఎత్తు రెట్టింపు కలిపి ధర నిర్ణయించారు. అప్పట్లో ఇది నిర్వాసితులకు ఆమోదయోగ్యంగా ఉండటంతో అంగీకరించి అగ్రిమెంట్లపై సంతకాలు చేశారు.