కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిధిలోని జె.తిమ్మాపురం గ్రామం వద్ద 22 కిలోల గంజాయి తరలిస్తూ నలుగురు వ్యక్తులు పట్టుబడినట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ బి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాస్ ఆదేశానుసారం డివిజినల్ టాస్క్‌ఫోర్స్ (డీటీఎ్‌ఫ్) సిబ్బంది ద్వారా తమకు అందిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వలపన్ని పట్టుకున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన స్థానిక విలేఖరులకు తెలిపారు. జె.తిమ్మాపురం గ్రామం జంక్షన్‌వద్ద హీరో గ్లామర్ మోటార్ బైక్‌తో నలుగురు వ్యక్తులు రెండు ట్రావెలింగ్ బ్యాగులతో ఒకేచోట అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అనుమానం కలిగింది. దీంతో వారి బ్యాగులను తనిఖీచేయడంతో బ్యాగుల్లో 22,615 గ్రాములు గంజాయిని కనుగొన్నట్లు చెప్పారు. దీని విలువ సుమారు రూ.77వేల వరకూ ఉంటుందన్నారు. ఈ గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా కేడీ పేట నుంచి శివంగి నూకరాజు అనే వ్యక్తి సరఫరా చేస్తునట్లు చెప్పారు. అలాగే జె.తిమ్మాపురం గ్రామానికి చెందిన పిల్లి రామలక్ష్మీ, పిల్లి వెంకటరమణ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోపాలకృష్ణ రాజేష్ కన్నణ్‌లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి ఒక మోటార్‌సైకిల్, నాలుగు సెల్‌ఫోన్లు రూ.1500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఈదాడుల్లో ఎస్‌ఈబీ సిబ్బంది విజయకుమారి, కె.నవీన్, జి.అప్పారావు, వెంకటరమణ పాల్గొన్నారు.