‘‘షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. సజ్జలకు దమ్ముంటే నన్ను అరెస్టు చేయాలి’’ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పెద్దలు అన్ని అంశాలనూ పక్కనపెట్టి రూరల్ నియోజకవర్గంపైనే దృష్టి సారించారు. నాలుగు నెలల క్రితం నమోదు చేసిన ఓ కేసులో తాజాగా నా ముఖ్య అనుచరుడు, మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వరరావుతోపాటు కార్యకర్తలు జావీద్, మన్నేపల్లి రఘును అరెస్టు చేశారు. షాడో సీఎం సజ్జల ఆదేశాల మేరకే పోలీసులు నాటి కేసును నేడు కీలకమైన కేసుగా మార్చారు. కనీస ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేసి.. వారిని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లకుండా మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని ప్రాంతాల్లో వాహనాల్లో తిప్పుతూ తుపాకితో బెదిరింపులకు పాల్పడ్డారు. మీ బెదిరింపులకు, వేధింపులకు నా వెనుక నడిచే నేతలు, కార్యకర్తలే కాదు... నావద్ద పనిచేసే డ్రైవర్లు కూడా భయపడరు. 24 గంటల్లో కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పిన పోలీసు అధికారులు రాత్రికిరాత్రే చార్జిషీట్‌లను సిద్ధం చేసి తెల్లవారుజామున 4 గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు పంపించారు. నన్ను కూడా ఈ కేసులో చేర్చారు. నాతోపాటు 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు నా సోదరుడు గిరిధర్‌రెడ్డి పేరు పెట్టడం మరిచిపోయారా లేక ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారా? అలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా నేను లొంగను, సమస్యలను ఎదుర్కొని పోరాటం చేస్తాం. నేను రూరల్ నియోజకవర్గంలోనే తిరుగుతుంటా. దమ్ముంటే నన్ను అరెస్టు చేసి వాహనాల్లో తిప్పుతూ తుపాకులతో బెదిరించుకోండి’ అంటూ సవాల్ విసిరారు. నన్ను అడ్డుకునేందుకు చేస్తున్న మీ కుయుక్తలకు బెదిరేవాడిని కాదు. నోటీసులివ్వకుండా భయబ్రాంతులకు గురిచేసే రీతిలో చేస్తున్న అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తా’’ అని తెలిపారు.