తాజాగా దేశాభివృద్ధికి కీలకమైన పరిశ్రమలు కూడా మూతపడుతుండడం పాకిస్థాన్ దయనీయ స్థితికి అద్దం పడుతుంది. ముడిసరుకు క పాకిస్థాన్ లోని అతిపెద్ద కంపెనీల్లో కొన్ని నెలలుగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. విదేశీ మారకద్రవ్యం నిల్వలు తరిగిపోతుండడంతో దిగుమతులకు బ్రేక్ పడింది. అస్థిరత తోడవడంతో పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం రాకెట్ లా పైపైకి దూసుకుపోతోంది. ధరలు మండిపోతున్నాయి, విద్యుత్ సంక్షోభం కుదిపివేస్తోంది. పాక్ ప్రజలు కడుపు నిండా తిండి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నట్టు కొన్ని కథనాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ కార్ల తయారీ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ పాకిస్థాన్ లో తన కార్యకలాపాల నిలిపివేతను ఫిబ్రవరి 21 వరకు పొడిగించింది. టైర్లు, ట్యూబులు తయారుచేసే గాంధార టైర్ అండ్ రబ్బర్ కంపెనీ ఫిబ్రవరి 13 నుంచి మూతపడింది. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 3.19 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే ఉండగా, కీలక దిగుమతులకు అది ఏమాత్రం సరిపోదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ కు రావాల్సిన సరుకు కంటైనర్ల చెల్లింపులు జరగకపోవడంతో పలు దేశాల్లో పోర్టుల్లోనే నిలిచిపోయాయి. అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే పరిశ్రమలు నిలిచిపోతే దేశం దుర్భర దారిద్ర్యంలోకి దారితీస్తుందని, నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.