రాష్ట్రంలో పోలీస్ శాఖ రెండుగా చీలిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. కొందరు పోలీస్ అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి వ్యవహరిస్తుంటే, మరి కొందరు పద్ధతిగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొత్తులుగా మారిన కొందరు అధికారుల తీరుతో మొత్తం పోలీస్ శాఖకే ప్రజల్లో చెడ్డపేరు వస్తోందని, వారి ఓవరాక్షన్ చూసి సహచరులే బాధపడుతున్నారన్నారు. ‘‘చంద్రబాబు తూర్పుగోదావరి పర్యటనలో పోలీసుల అతి మామూలుగా లేదు. అనపర్తి సభలో పాల్గొన్నందుకు వేలమందిపై కేసులు పెట్టారు. ప్రతిపక్షాలకు చెందిన వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భయపడుతున్నారు’’ అని వర్ల అన్నారు.