వైసీపీలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల అసంతృప్తి భగ్గుమంటోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పేరు ప్రకటించగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆ పార్టీ నాయకులు హతాశులయ్యారు. వారం కిందటి దాకా టీడీపీలో ఉన్న నాయకుడు ఆయన. లోకేశ్ పాదయాత్రలోనూ నడిచారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగానే ఆయనకు ఆరేళ్ల పాటు అధికారంలో ఉండే ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారో అంతుపట్టడం లేదని పలువురు ఆశ్చర్యపోతున్నారు. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట ఉండి, ఎన్నో పోరాటాలు చేసి, పార్టీ కోసం ఎంతో ఖర్చు కూడా పెట్టిన నేతలను గాలికి వదిలేసి, కనీసం వైసీపీలో కూడా చేరని నాయకుడికి ఏకంగా ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ఆ పార్టీ నాయకులు పలువురు భగ్గుమంటున్నారు.