వల్లభనేని వంశీ, కొడాలి నాని పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఒక మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్.. ఇక కొడాలి నాని ఒక గ్రామ సింహం అంటూ మండిపడ్డారు. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో వైసీపీ గుండాలను మించిన అత్యంత తీవ్ర నేరగాడు వల్లభనేని వంశీ. గన్నవరంలో వైసీపీ మూకలు టీడీపీ కార్యాలయం, వ్యక్తులపై దాడికి పాల్పడతారని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ముందే తెలుసు. పోస్టింగ్ ఇవ్వరేమోనన్న భయంతో జిల్లా ఎస్పీ అన్ని విషయాలు దాచి పెడుతున్నారు. పార్టీ ఆఫీస్, నాయకుల ఆస్తులపైనే దాడులు చేసి.. తిరిగి తమ నాయకులపైనే కేసులు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి?, అరాచకాలు, అవినీతితో వైసీపీ సర్కార్ పాలన సాగిస్తోంది.’’ అని ధ్వజమెత్తారు.