దివాళ అంచున చేరిన ఐదు బ్యాంకులపై తాజాగా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వివిధ రకాల బ్యాంకులు సేవలందిస్తున్నాయి. అయితే, వాటికి మొండి బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకుల పరిస్థితి దారుణంగా మారుతోంది. రోజు వారీ నగదు లావాదేవీలకు సైతం సరిపడా నిధులు లేకుండా మారుతున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని గర్హా ప్రాంతానికి చెందిన ఓ కో-ఆపరేటివ్ బ్యాంకు దివాలా తీయడంతో దాని లైసెన్సును రద్దు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మరో 5 బ్యాంకులపై చర్యలు చేపట్టింది. దివాలా అంచున ఉన్న 5 కోఆపరేటివ్ బ్యాంకుల నగదు విత్ డ్రాలు, డిపాజిట్లపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 24 అంటే ఇవాళ్టి నుంచే అమలులోకి తీసుకొచ్చింది.
దివాలా అంచుకు చేరుకున్న 5 బ్యాంకులు ఇవే..
హెచ్‌సీబీఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
ఊరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్
ఆదర్శ మహిళా నగరి సహకారి బ్యాంక్ మర్యాదిత్
శింశా సంహకారి బ్యాంక్ నియమితా
శంకర రావు మోహిత్ పాటిల్ సహకారి బ్యాంక్ లిమిటెడ్
మూడు బ్యాంకులపై పాక్షిక ఆంక్షలు.. రెండింటిపై పూర్తి స్థాయిలో..
ఈ క్రమంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సెంట్రల్ బ్యాంకు ఆమోదం లేకుండా ఆయా బ్యాంకులు కొత్త డిపాజిట్లను తీసుకోవడం లేదా రుణాలు ఇవ్వడం కుదరదని పేర్కొంది. ఈ ఐదింటిలో మూడు బ్యాంకులపై నగదు ఉపసంహరణపై పాక్షిక ఆంక్షలు విధించగా.. రెండింటిపై పూర్తి స్థాయి ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో బ్యాంకుల డిపాజిటర్లు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకన్నట్లు పేర్కొంది. అయినప్పటికీ బ్యాంకు కస్టమర్లలో తమ డబ్బులు వస్తాయా లేవా అనే ఆందోళన నెలకొంది.
డిపాజిటర్లకు భరోసా..
5 కోఆపరేటివ్ బ్యాంకులు దివాలా అంచుకు చేరుకున్న నేపథ్యంలో ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ డిపాజిటర్లకు భరోసా కల్పించింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా రూ.5 లక్షల వరకు అర్హులైన డిపాజిటర్లు పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, అది డిపాజిటర్లపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయలేదని స్పష్టం చేసింది ఆర్‌బీఐ. ఈ బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పడే వరకు ఆంక్షల మధ్య బ్యాంకింగ్ బిజినెస్ కొనసాగించుకోవచ్చు.