పల్నాడు జిల్లాలో గత కొన్ని రోజులుగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా గత కొద్దికాలంగా వార్ కొనసాగుతోంది. తాజాగా దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తపై దాడి జరిగింది. అయితే.. సామాజిక మాధ్యమాల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించాడని.. టీడీపీ కార్యకర్తను రోడ్డుపై పరిగెత్తించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం మాచర్ల పోలీస్‌స్టేషన్‌లో సంతకాలు చేసేందుకు రాగా.. కారంపూడికి చెందిన పార్టీ కార్యకర్త గోరంట్ల నాగేశ్వరరావు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించారు.
సోమవారం ఉదయం ఆ వంట సామగ్రి అప్పజెప్పేందుకు వెళ్లి అంకాళమ్మ ఆలయం మీదుగా ఇంటికి వస్తున్నారు. అక్కడే కాపు కాసిన నలుగురు వ్యక్తుల్లో ఒకరైన మస్తాన్.. నాగేశ్వరరావు వాహనాన్ని ఆపాడు. నీ కారు డ్రైవర్‌తో పోస్టులు పెట్టించావుగా.. ఎమ్మెల్యే పైనే పోస్టులు పెడతారా.. బ్రహ్మారెడ్డిని చూసుకుని ఎక్కువ చేస్తున్నావు అంటూ వాదనకు దిగాడని బాధితుడు చెప్పారు. ఇంతలో ఒప్పిచర్లకు చెందిన చిరుమామిళ్ల శ్రీకాంత్ వెనుక నుంచి కర్రతో దాడి చేశాడు. నరేంద్ర, చోటా కరీమ్ సైతం ఇనుపరాడ్లతో కొట్టారు. బస్టాండ్ వైపు పరుగు తీయగా తరుముతూ.. కొట్టుకుంటూ వచ్చారని బాధితుడు నాగేశ్వర రావు ఆరోపించారు.
కారంపూడికి చెందిన సాంబశివరావు అనే కారు డ్రైవర్.. నాగేశ్వర రావును ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అయితే.. దాడి చేసిన వ్యక్తులు అక్కడికీ వచ్చి పోలీసులు, టీడీపీ నేతల ముందే మరోమారు అతనిపై చేయి చేసుకున్నారు. నాగేశ్వరరావును పోలీసులు గురజాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరతో.. కర్రలతో కొట్టి గాయపరిచినట్లు కేసు నమోదు చేశామని ఎస్సై రామాంజనేయులు వివరించారు. నరసరావుపేటలో చికిత్స పొందుతున్న అతన్ని.. జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు.
అయితే.. దాడి చేసిన వ్యక్తులు మాత్రం వేరే కారణం చెబుతున్నారు. క్రికెట్ బుకీగా వ్యవహరించే గోరంట్ల నాగేశ్వరరావు.. తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే దాటవేస్తుండటంతో వివాదం చెలరేగింది. అందుకే కొట్టామని చిరుమామిళ్ల శ్రీకాంత్, నరేంద్ర, చోటా కరీమ్, మస్తాన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇది డబ్బుల విషయంలో జరిగిన గొడవేనని.. పార్టీలకు సంబంధం లేదని ఆ వీడియోలో స్పష్టం చేశారు.