ఇకపై బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులు బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందిస్తుండగా.. దేశ ప్రజలకు మాత్రం బ్యాడ్‌న్యూస్‌గా చెప్పుకోవాలి. త్వరలోనే బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్న వారానికి 5 పని దినాల విషయంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆర్థిక లావాదేవీలపై అధికంగా ఆధారపడే వ్యక్తులు, సంస్థలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో 5 రోజుల పని దినాల సంప్రదాయం ఉంది. 5 రోజులు పని చేసిన రెండు రోజులు వీకాఫ్ తీసుకుంటున్నారు. బ్యాంకు ఉద్యోగులు సైతం తమకు కూడా వారానికి రెండు వీకాఫ్స్ కావాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఉద్యోగుల డిమాండ్‌ను పెద్దగా పట్టించుకోని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఇప్పుడు సానుకూలంగా స్పందించిందని, తమ డిమాండ్‌ను పరిశీలిస్తోందని బ్యాంకు ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా నిర్ణయం వెలువడితే ఇక బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులే పని చేసి 2 రోజులు వీకాఫ్ తీసుకోవచ్చు.
దీనికి సంబంధించి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య చర్చలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 5 రోజుల పని దినాలకు ఐబీఏ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు బ్యాంక్ వర్గాల సమాచారం. అయితే, అధికారికంగా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ క్రమంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 అనుసరించి ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తెలిపారు. అయితే, ఈ నిర్ణయానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు యజమానిగా ఉన్న కేంద్రం కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దాంతో పాటు రిజర్వ్ బ్యాంక్ సైతం ఆమోదించాలి.
ఇదిలావుంటే వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరిస్తే ఉద్యోగులకు ఓ మెలిక పెట్టే అవకాశాలు ఉన్నాయి. రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులు మూసి ఉంటాయి. ఒకటో, మూడో శనివారాల్లో పూర్తిగా బ్యాంకులు పని చేస్తాయి. ఒకవేళ 5 రోజుల పని దినాలకు అంగీకరిస్తే శనివారాల్లో చేసే పని గంటలు పోతాయి. అయితే, వాటిని సర్దుబాటు చేసేందుకు వారంలో మిగిలిన ఐదు రోజులు పని గంటలను మరో 50 నిమిషాల వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై గత ఏడాది ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఐబీఏకు ఓ లేఖ రాసింది. వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయడానికి రోజుకు పని గంటల్లో మరో 30 నిమిషాలు అదనంగా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని లేఖలో పేర్కొంది.