విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ (స్వరాజ్ మైదానం) పరిధిలో న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించి ఏమైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కమిషనర్‌ను జైలుకు పంపిస్తామని హైకోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు జరిపినట్లు, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే అఫిడవిట్ వేయాలని పిటిషనర్‌కు సూచించింది. విచారణను రెండువారాలకు వాయిదావేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందనరావు బుధవారం ఆదేశాలిచ్చారు. విజయవాడ స్వరాజ్ మైదానం పరిధిలో ఆక్రమణలు తొలగించాలని, మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ముక్కామల నాగభూషణం వీధిలో జరుగుతున్న పలు ఆక్రమణలను అడ్డుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాశ్ 2015లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బుధవారం విచారించారు.