కర్ణాటక రాష్ట్రము, బెంగుళూరులో దారుణం జరిగింది. కానీ హంతకుడు, హతురాలు ఇద్దరూ ఆంధ్రా వాసులే. కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25) అనే యువతిపై దినకర్ (28) అనే యువకుడు కత్తితో దాడిచేశాడు. కత్తితో 16సార్లు పొడిచి కిరాతకంగా హతమార్చాడు. దినకర్‌ది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెల్లివలస గ్రామం. ఈ దారుణం బెంగళూరులోని మురుగేశ్‌పాళ్యలో మంగళ వారం సాయంత్రం చోటుచేసుకుంది. లీలా పవిత్ర మురుగేశ్‌పాళ్యలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామం. ఆమె తండ్రి చౌదరి వ్యవసాయదారు. లీలా పవిత్ర చదువు కోసం ఐదేళ్ల క్రితం భార్య రాధతో కలిసి కాకినాడకు మకాం మార్చారు. కాకినాడలో ఆయన వడ్డీ వ్యాపారం చేస్తూ అమ్మాయిని చదివించుకున్నారు. ఎమ్మెస్సీ చేసిన లీలాపవిత్ర విశాఖపట్నంలోని ఓ హెల్త్‌కేర్ సంస్థలో ఉద్యోగం చేసింది. అక్కడే ఆమెకు దినకర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇంతలో ఆమెకు బెంగళూరులోని మురుగేశ్‌పాళ్యలోని ఒమేగా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులను ఒప్పించి ఏడాది క్రితం ఆమె అక్కడికి వెళ్లారు. దినకర్ కూడా బెంగళూరులో లీలాపవిత్ర ఆఫీ్‌సకు సమీపంలోని మరో హెల్త్‌కేర్ కంపెనీలో చేరాడు. ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు లీలా తెలిపారు. కులాలు వేరుకావడంతో ఆమెను మందలించారు. దీంతో వారు తెచ్చిన సంబంధం చేసుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. దినకర్ పెళ్లి కోసం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆమె ససేమిరా అంటున్నారు. దినకర్‌కు లీలా దూరంగా ఉంటున్నారు. పలుమార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో దినకర్ కోపం పెంచుకున్నాడు. ఇక ఆమె తనకు దక్కదని నిర్ణయానికి వచ్చి ఉన్మాదిగా మార్చింది. మంగళవారం సాయంత్రం ఆమె ఆఫీ్‌సనుంచి రూమ్‌కు వెళుతుండగా దారి కాచి కత్తితో దాడిచేశాడు. ఛాతీ, గొంతుతోపాటు శరీరంపై బలమైన గాయాలు కావడంతో లీలా అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు దినకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.