తిరుపతి నగరంలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో నకిలీ రోగుల పేరిట ధ్రువపత్రాలు సృష్టిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆరోగ్య ఆసరా నిధులు పక్కదారి పట్టించిన ముగ్గురు కేటుగాళ్లను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో నకిలీ రోగులు పేరిట ధ్రువపత్రాలు సృష్టించి ఆరోగ్య ఆసరా నిధులు కాజేశారని ఆరోగ్యశ్రీ ట్రస్టు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 35 మందికి సంబంధించిన ఆరోగ్య ఆసరా నిధులు దుర్వినియోగం అయినట్లు పోలీసులు గుర్తించారు. రుయా ఆసుపత్రిలో ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తిరుమల, శివ, చెంచయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.