తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వారాంతరాల్లో, సెలవుల్లో భక్తులు సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో స్వామివారికి దర్శించుకునేందుకు గంటల సమయం పడుతుంది. అయినప్పటికీ తిరుమల వెంకన్నను దర్శించుకుని భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. నగదు, బంగారం ఇలా వారికి తోచిన విధంగా స్వామి వారికి భక్తులు మొక్కులుగా సమర్పించుకుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో స్వామివారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, హుండీ ఆదాయం తదితర వివరాలను టీటీడీ వెల్లడించింది. ఫిబ్రవరి మాసంలో 18.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొంది. అలాగే ఫిబ్రవరి మొత్తంగా శ్రీవారికి హుండీ ద్వారా రూ. 114.29 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 92.96 లక్షల లడ్డులను భక్తులకు టీటీడీ విక్రయించింది. అలాగే 7.21 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 34.06 లక్షలుగా టీటీడీ వెల్లడించారు.