ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, మండపేటలోని ఒక ప్రాంతంలో బుధవారం 21 కిలోల గంజాయి పట్టుకున్నట్టు మండపేట రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్ చెప్పారు. మండపేట-ఏడిద రోడ్డులో వున్న సురేంద్ర సాల్వెంట్ ఆయిల్ ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో కార్మికులు నివాసం ఉండే షెడ్డులో నిరుపయోగంగా వున్న ఒక గదిలో గంజాయి వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రూరల్ ఎస్‌ఐ శివకృష్ణ, సిబ్బంది, మండపేట డిప్యూటీ తహశీల్దారు పద్మ, ఆర్‌ఐ దర్గాప్రసాద్ సంయుక్తంగా దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయితోపాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ బ్రాన్ ఆయిల్ మిల్లులో జట్టు మేస్త్రీగా పనిచేస్తున్న వై.సీతానగరానికి చెందిన కసిరెడ్డి పెద్దకాపు (పోతు రాజు), మోడేకుర్రుకు చెందిన చింతపల్లి సురేష్, రావులపాలేనికి చెందిన బొండాడి రాంబాబులను ఆరెస్టు చేశారు. కొంతకాలంగా వీరంతా కలిసి గంజా యి వ్యాపారం చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ముగ్గురినీ ఆదుపులోకి తీసుకుని గురువారం ఆలమూరు కోర్టుకు తరలించారు. ఏడిద రోడ్డులోని సాల్వెంట్ ఆయిల్ కంపెనీకి కోల్‌కత్తాకు చెందిన లారీ డ్రైవర్ మనోజ్ గంజాయి తెచ్చి ఇస్తుంటాడు. అతను రానప్పుడు నర్సీపట్నం నుంచి సురేష్. రాంబాబు గంజా యి తెచ్చి పెద్దకాపుకు ఇస్తారని సమాచారం. పెద్దకాపుతోపాటు అతడి బావ మరిది రాంబాబు, సురేష్ గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. మండపేట రూరల్ సీఐ శివగణేష్ సారధ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. కాగా వీరు మండపేటతోపాటు పరిసర ప్రాంతాల్లో యు వతను లక్ష్యంగా చేసుకుని గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్టు సమాచారం.