కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మటన్ దుకాణాలపై.. మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్ ఆకస్మిక దాడులు చేశారు. ప్రీజర్స్‌లో నిల్వ ఉంచిన సుమారు 100 కిలోల కుళ్లిన, కల్తీ మటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెత్తలో పడేయాల్సిన మాంసాన్ని.. హోటల్స్‌కు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. విక్రయదారులు కుళ్లిన మాంసాన్ని సంచుల్లో నింపి అమ్మకానికి సిద్ధం చేశారు. అంతేకాకుండా.. జబ్బున పడిన గొర్రెలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. పొట్టేలు మాంసం అని మభ్యపెడుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. బయట పొట్టేలు మాంసాన్ని ఉంచి.. లోపల గొర్రె మాంసం అమ్మకాలు చేస్తోంది మటన్ మాఫియా.
తనిఖీల్లో ఇవన్నీ చూసి.. అధికారులు షాక్ అయ్యారు. దీంతో మటన్ మాఫియాకు వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ సాయినాథ్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే.. ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని.. కల్తీ మంసాన్ని విక్రయిస్తున్న మటన్ దుకాణ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. గూడూరు పట్టణంలో త్వరలో నూతన మటన్ మార్కెట్ అందుబాటులోకి తెస్తున్నామని.. వెల్లడించారు. తప్పనిసరిగా మాంసం విక్రయదారులు ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాలని.. అనధికారిక విక్రయాలు జరిపినా.. కల్తీ మాంసం అమ్మినా.. చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ మాంసాన్ని చూసి.. స్థానికులు అవాక్కయ్యారు.