ఆటోలోనుంచి పడ్డ రూ.500 నోట్లు ఎవరివి అన్నది ప్రస్తుతానికి ఓ క్లారీటి వచ్చింది. ఇదిలావుంటే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్ దగ్గరఓ ఆటోలో తరలిస్తున్న రూ.500 నోట్లు గాలిలో ఎగురుకుంటూ హైవేపై పడ్డాయి. ఆ నోట్లను టోల్‌గేట్ సిబ్బంది గుర్తించగా.. కొందరు ఆటోను వెంబడించారు. ఈ డబ్బు ఎవరిది అనేది మిస్టరీగా మారింది. అయితే ఇంతలో ఓ మహిళ ఆ డబ్బులు తనవే అంటూ నరసన్నపేట పోలీసుల్ని కలిశారు.
గార మండలంలోని కోలపేట గ్రామానికి చెందిన నాగమణి భర్త చిన్నారావు చనిపోయారు. గతేడాది ప్రభుత్వం ఆమెకు రూ.5లక్షల బీమాను మంజూరు చేయగా.. వీటిలో రూ.లక్ష ఎచ్చెర్ల మండలంలోని ఎస్.ఎం.పురంనకు చెందిన కొట్టి లక్ష్మికి అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బులు.. అప్పుతో పాటు వడ్డీగా మొత్తం రూ.1,27,000 ఈనెల 3న లక్ష్మి నాగమణికి తిరిగిచ్చింది.. ఆ డబ్బుల్ని తీసుకున్న నాగమణి పుట్టింట్లో భద్రపరిచేందుకు అదేరోజు శ్రీకాకుళం నుంచి ఆటోలో బయలుదేరి మాకివలసకు వెళ్లారు.
ఒక సంచిలో డబ్బుల్ని పెట్టి దానిపై చీర ఉంచారు. ఇంతలో మడపాం టోల్‌గేట్ దగ్గరకు రాగానే సంచిపై ఉన్న చీర ఎగిరిపోయి నోట్లు రోడ్డుపై పడ్డాయని ఆమె చెబుతున్నారు. ఆ సమయంలో ఫోన్‌లో మాట్లాడుతూ గమనించకుండా దేవాది దగ్గర నాగమణి ఆటో నుంచి దిగిపోయి మాకివలస వెళ్లింది. తనతో పాటు తీసుకెళ్లిన సంచిని తల్లి గన్నెమ్మకు అప్పగించింది. అయితే డబ్బులి ఉన్నాయా, లేదా అన్నది మాత్రం గమనించలేదు. 4న సంచిలో డబ్బులు లేనట్లు గుర్తించింది.
ఆ డబ్బులు ఏమయ్యాయని టెన్షన్ పడింది. ఇంతలో సోషల్ మీడియా ద్వారా గాలిలో నోట్లు ఎగిరిపోయిన విషయం గ్రామానికి చెందిన కొందరు నాగమణికి చెప్పారు. పోగొట్టుకున్న సొమ్ము గురించి నాగమణి, ఆమె తల్లి గన్నెమ్మ పోలీసుస్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చారు. ఆమె అప్పు ఇచ్చిన మహిళను స్టేషన్‌కు పిలిపించి నాగమణి చెప్పింది నిజమా కాదా అన్నది ఆరా తీశారు. ఇప్పటికే ఆ సొమ్మును రెవెన్యూ కోర్టుకు అప్పగించారు పోలీసులు. ఆమెను తహసీల్దార్ దగ్గరకు పంపగా.. వివరాలు తెలుసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం రావాలని సూచించారు.