రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించింది. మార్చి 23న పోలింగ్, అదేరోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. 25తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. చల్లా భగీధరరెడ్డి పదవీ కాలం గత నవంబరు 2తో ముగిసింది. నారా లోకేశ్, బచ్చుల అర్జునుడు, పెనుమత్స సూర్యనారాయణరాజు (టీడీపీ), డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, గంగుల ప్రభాకర్‌రెడ్డి(వైసీపీ) పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుండడంతో ఆ ఖాళీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.