ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో సొంత నిర్ణయాలు పనికిరావని స్పష్టం చేశారు. ప్రతీఒక్కరూ అత్యంత అప్రమత్తంగా విధులను నిర్వహించాలని సూచించారు. ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఆర్‌డిఓలు, తాశిల్దార్లు, పోలీసు అధికారులతో ఆన్‌లైన్లో, ఎస్‌డిసిలు, ఇతర అధికారులతో ప్రత్యక్షంగా తన ఛాంబర్ నుంచి సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటు ఉన్నవారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రక్కప్రక్కన పోలింగ్ బూత్‌లు ఉన్నచోట, క్యూలైన్లను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కొక్కరినీ పోలింగ్ బూత్‌లోకి పంపించాలని, కెమేరాలను లోపలికి అనుమతించకూడదని చెప్పారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్ మాట్లాడుతూ, పోలింగ్ ప్రక్రియకోసం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకల్లా పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. అత్యంత అప్రమత్తంగా విధులను నిర్వహించాలన్నారు. రూట్ ఇన్‌ఛార్జిలు ముందుగానే రూట్‌ను తనిఖీ చేసుకోవాలన్నారు. క్యూలైన్ల ప్రచారం చేయకూడదని, ఇలాంటి సంఘటనలను అడ్డుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లకు అనుమతి లేదని, ఒకవేళ ఎవరైనా తీసుకువస్తే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పంపించాలని చెప్పారు. వాహనాల ద్వారా ఓటర్లను తరలించడాన్ని అడ్డుకోవాలని చెప్పారు. ఓటు విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే, వారికి ఓటును తిరస్కరించకుండా, రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.