జగన్ పాలనలో అందరూ బాధితులేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నేడు ఆయన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంగళ్లలో నారా లోకేష్‌కి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్ల పైకి తరలివచ్చారు. లోకేష్‌ని కలిసి అంగళ్లు నిర్వహిస్తున్న యువకులు, మహిళలు, వృద్ధులు తమ బాధలు చెప్పుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేశారంటూ తమ బాధను లోకేష్ వద్ద పలువురు వృద్ధులు వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక బెంగుళూరు వెళ్లి పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నాం అని అంగళ్లు నిర్వహిస్తున్న యువకులు తెలిపారు.