చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరిన టీడీపీ నాయకులు పారిపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెటైర్లు వేశారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం తంబళ్లపల్లెలో ఉన్నారని.. అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. అమర్నాథ్ రెడ్డి.. లోకేష్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని.. సవాల్ చేసిన అమర్నాథ్ రెడ్డి కనిపించటం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.
మదనపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే కాదని.. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని నారా లోకేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే నవాజ్ బాషాతో, పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు అందరు కలిసి మదనపల్లిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే.. ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు 40 ఎకరాల భూమిని కబ్జా చేసి.. వెంచర్లు వేసి అమ్మేశారని వ్యాఖ్యానించారు. చివరకు కొండలు, చెరువులు, భూములు.. దేన్నీ వదలకుండా స్వాహా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై ఇరు పార్టీల మధ్య వార్ నడుస్తోంది.