ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి నియంతనో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నియంతృత్వానికి ప్రజలు బలైపోతున్నారు. వింత నిబంధనలు, విచిత్ర ఆంక్షలతో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అక్కడ ప్రజలతో బయట ప్రపంచానికి సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి కనీసం తెలియదు. ఈ నేపథ్యంలో కిమ్ గురించి చదవడానికి సాహనం చేసిన ఓ గూఢచారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీనిని బట్టి ఉత్తర కొరియాలో పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అవగతమవుతోంది.ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ టాప్ సీక్రెట్ బ్యూరో 10కి చెందిన పలువురు ఏజెంట్లు సెన్సార్ చేయని ఇంటర్నెట్ కంటెంట్‌ను అక్రమంగా యాక్సెస్ చేస్తూ పట్టుబడ్డారు. ఇందులో ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించగా.. మిగతా అధికారులను తమ పదవుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. దేశంలోని 2.6 కోట్ల మంది పౌరుల కమ్యూనికేషన్‌లను ట్రాక్ చేయడంలో ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. బ్యూరో 10 అధికారి అధినేత కిమ్ గురించి శోధించిన వెంటనే వారి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యూరో 10 ఇంటర్నెట్ యాక్సెస్ ఏజెంట్‌లు వారి సెర్చ్ వర్డ్ రికార్డింగ్ పరికరాలను ఆపివేయడానికి, సమస్య లేకుండా వెబ్‌లో తమకు నచ్చిన విధంగా శోధించడానికి అనుమతించింది.
కానీ కొత్త బ్యూరో చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సాధారణ సమస్యలు కూడా పెద్ద సంఘటనలుగా మారాయి. కిమ్ జోంగ్ ఉన్ గురించి గూగుల్ చేసినందుకు ఓ ఏజెంట్‌కి మరణ శిక్ష విధించారు. ఉత్తర కొరియాలోని మానవ హక్కుల కమిటీ డైరెక్టర్ గ్రెగ్ స్కార్లాటోయు మాట్లాడుతూ.. ఇంటర్నెట్ యుగంలో బయటి సమాచారాన్ని నిరోధించడానికి పోరాడుతున్న దేశంపై పట్టు నెమ్మదిగా సడలుతోందనడానికి ఈ వార్త సంకేతమని అన్నారు. కిమ్ పాలనలో అత్యంత విశ్వసనీయ ఏజెంట్లు కూడా ఇప్పుడు బయటి ప్రపంచం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
బలవంతం, శిక్ష, నిఘా, సమాచార నియంత్రణ ద్వారా కిమ్ కుటుంబం అధికారంలో కొనసాగుతోందని, బయటి ప్రపంచం నుంచి దేశంలోకి ప్రవేశించే సమాచారం పాలనకు ముప్పుగా భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఏదో ఒకరోజు వారి కుటుంబపాలన అంతమై చరమగీతం పాడుతారని ఆయన జోస్యం చెప్పారు. ఈ సంఘటన ఉత్తర కొరియా ఉన్నతాధికారులలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. గూఢచారి ఏజెంట్లు సహోద్యోగులకు రహస్య సమాచారాన్ని లీక్ చేసి ఉండొచ్చు అనే ఆందోళనల తర్వాత మంత్రిత్వ శాఖలో భారీ అణిచివేత చోటుచేసుకుంది.