ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగేళ్లయినా దోషులు ఎవరో తెలియని వైనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 12:48 PM

వివేకా హత్య కేసులో దోషులెవరో తేల్చేందుకు సీబీఐ విచారణ కోసం ఆయన కూతురు కోర్టుమెట్లెక్కారు. సీబీఐ విచారణను జరిపించేలా కోర్టును ఒప్పించారు. దేశంలో రాజకీయ పార్టీల నాయకులకు, కార్పొరేట్‌ శక్తులకు సైతం సీబీఐ విచారణ అంటే వణుకు. అలాంటి సీబీఐ బృందానికే కడప యిజం చూపించారు. విచారణ అధికారి రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేయించారు. కడప వదిలిపోకపోతే బాంబులేసి లేపేస్తామంటూ సీబీఐ బృందం డ్రైవరుకు బెదిరింపులు వచ్చాయి. వివేకా కేసులో ఎర్రగంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ యాదవ్‌, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసింది. వీరిలో ఎర్రగంగిరెడ్డి బెయిల్‌పై బయట ఉండగా, షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. మిగతా ముగ్గురు హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు అవినాశ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై కేసు నమోదుచేశారు. దీంతో ఈ కేసు అత్యంత కీలక మలుపు తిరిగింది. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు అనుమానితుల జాబితాలోకి వచ్చిచేరాయి. ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు సీబీఐ విచారణ చేయగా, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని పిలిచి విచారించనుంది. ఏపీలో ఉంటే కేసు విచారణ త్వరగా జరగదని, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఆమె విజ్ఞప్తి మేరకు విచారణను తెలంగాణకు బదిలీచేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి కేసు విచారణ వేగవంతం అయింది. ఈ దశలో విచారణ అధికారి రామ్‌సింగ్‌పై ఎంపీ అవినాశ్‌ తీవ్ర ఆరోపణలు చేస్తూ విచారణ ముందుకుపోకుండా ప్రతిబంధకాలు వేస్తున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో ఆరోపణలు, ఇతరత్రా పేర్లు వినిపించిన వారిలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి గంగాధర్‌రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలోని తన స్వగృహంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివేకా హత్యకు గురైనరోజు వైఎస్‌ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి నడిపే ఆస్పత్రి నుంచి వచ్చిన వ్యక్తి గాయాలు కడిగి కుట్లు వేశారు. ఈసీ గంగిరెడ్డి ఇటీవల మృతిచెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa