గాజువాక నియోజక వర్గ పరిధిలోని ఆటోనగర్‌లో బుధవారం రాత్రి శ్రీశివసాయి ఐరన్ ట్రేడర్స్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అపరిచిత వ్యక్తులు ఇక్కడ కాపర్ వైర్లను తగులబెట్టారు. చిన్న మంటలు కాస్తా పెద్దవై ఎగసిపడడంతో పక్కనే వున్న వ్యర్థాలకు, ప్లాస్టిక్ సామగ్రికి, వేస్ట్ ఆయిల్ డబ్బాలకు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగ, తీవ్ర స్థాయిలో మంటలు వ్యాపించడంతో పాటు దుర్గంధభరితమైన వాసన రావడంతో స్థానికులు ముక్కులు మూసుకుని పరుగులు తీశారు.
పక్కనే వెల్డింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పలు గ్యాస్ సిలండర్లను యువకులు దూరంగా తరలించారు. ఆ సమీపంలోనే వున్న అగరుబత్తుల కర్మాగారంలో పూర్తి స్థాయిలో స్టాక్ వుండడంతో యాజమాన్య ప్రతినిధులు భీతిల్లిపోయారు. అగ్నికీలలకు వేస్ట్ ఆయిల్ డబ్బాలు పేలడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఏపీఐఐసీ ఐలా కమిషనర్ సూర్యనారాయణ ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.