తన చర్యల ద్వారా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. శనివారం కుటుంబంతో కలిసి లండన్‌లోని ఓ పార్కుకు వెళ్లిన సందర్భంగా ఆయన తన పెంపుడు కుక్క నోవా మెడకు బెల్ట్ కట్టకుండా స్వేచ్ఛగా వదిలేశారు. అయితే.. భద్రతా సిబ్బంది అప్రమత్తం చేయడంతో తప్పు సరిదిద్దుకున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు బ్రిటన్ ప్రధానిపై ఫైర్ అవుతున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కుక్కలకు బెల్టు కట్టాలన్న నిబంధనకు సంబంధించిన బోర్డు ఆ పక్కనే స్పష్టంగా కనిపిస్తున్నా రిషి లెక్కచేయలేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. రిషి సునాక్‌పై తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. దీంతో..బ్రిటన్‌లో ప్రస్తుతం ఈ ఘటనపై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే.. రిషి సునాక్ గతంలోనూ ఇలాంటి ఓ వివాదంలో పడ్డారు. రెండు నెలల క్రితం ఆయన కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో పోలీసులు జరిమానా విధించారు.