ఈ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అని.. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అని తెలిపారు. వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. విద్య ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశమన్నారు. విద్యా రంగానికి 32 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారని చెప్పారు. ఎక్కడ విద్యాధికులు ఉంటారో ఆ రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నామన్నారు. సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్నో ఆకలి చావులు... ఆత్మహత్యలు చూశామన్నారు. ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఉద్యోగులతో పని చేయించుకున్నప్పుడు జీతాలివ్వాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే అని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను బడ్జెట్‌లో కలిపి చూపామని అనడంలో వాస్తవం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.