తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 20 నుండి 28వతేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6. 30 నుండి 9. 30గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.