తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. జూన్ నెలకి చెందిన శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదలైంది. ఇవాళ(మార్చి 21న) మధ్యాహ్నం 12 గంటలకు టికెట్లను టీటీడీ విడుదల చేశారు. జూన్ నెలకి సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు మార్చి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉంటాయి. జూన్ నెలకు సంబంధించిన మిగిలిన ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది.
లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలకు చెందిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. జూన్ నెల వికలాంగుల దర్శనం టికెట్లు మార్చి 24 మద్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఇక్కడ స్కాన్ చేసి భద్రపరచిన మాను స్క్రిప్ట్స్ పై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలన్నారు. మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పురావస్తు శాఖ నుంచి తెచ్చిన సుమారు 5500 తాళపత్ర గ్రంధాల్లో ఇప్పటివరకు 3370 తాళపత్ర గ్రంధాలు స్కాన్ చేయడం జరిగిందని తెలిపారు ఈవో ధర్మారెడ్డి. ఇందులో 2,11,313 తాళపత్రాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. రెండు నెలల్లో మిగిలిన గ్రంధాలను కూడా స్కాన్ చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం, సిబ్బందిని ఇస్తామని ఈవో వివరించారు. ప్రస్తుతం రోజుకు ఎన్ని తాళపత్రాలు స్కాన్ చేస్తున్నారు, తాళపత్రం శుభ్రపరచడం నుంచి తైల శోధన, స్కానింగ్ వరకు జరిగే వివిధ ప్రక్రియల గురించి ఈవో తెలుసుకున్నారు.
వేదాంతం, పురాణాలు, కావ్యాలు, జ్యోతిష్యం తదితర అంశాలకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని అధికారులు ధర్మారెడ్డి కి వివరించారు. ఇవి జాతి సంపద అని, వీటిని జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తెలుగులో తర్జుమా చేయాలని ఈవో అధికారులకు సూచించారు. ఇలా తర్జుమా చేసిన వాటిని పుస్తక రూపంలో తేవడానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ పుస్తకాల ఆధారంగా పి హెచ్ డి చేయడానికి అవసరమైన వాతావరణం కల్పించి పిహెచ్ డి లు ప్రదానం చేసే ఏర్పాటు చేయాలన్నారు.
దేశంలో ఇంకా ఎక్కడ మాను స్క్రిప్ట్స్ ఉన్నాయో తెలుసుకుని వాటిని సేకరించి స్కాన్ చేసి భద్రపరచ గలిగితే పరిశోధకులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రంధాలను అంశాల వారీగా వర్గీకరించి వాటికి ప్రత్యేకంగా నంబర్లు వేసి భద్రపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన జీవన్ ట్రస్టు సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa