‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఆస్కార్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు, ఏనుగు మధ్య బంధంపై చిత్రీకరించిన అద్భుతమైన సినిమా ఇది. తమిళనాడు నుంచి వెలుగులోకి వచ్చిన ఈ రియల్ స్టోరీ ప్రపంచాన్నే కదిలించింది. అయితే, దీనికి ముందే.. ఏనుగులపై కొండంత ప్రేమ కనబరిచిన మరో వ్యక్తి ఉన్నారు. ఆయన ఇప్పుడు లేకపోయినా, ఆయన చూపిన ఔదార్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. తాను అపురూపంగా పెంచుకున్న ఏనుగుల కోసం ఆయన రూ. 5 కోట్ల విలువైన ఆస్తిని రాశారు. విషాదకరంగా ఆ ఆస్తి కోసమే ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన పెంచుకున్న రెండు ఏనుగుల్లో ఒకటి మృతి చెందగా.. మిగిలిన ఆ ఒక్క ఏనుగు ఇప్పుడు 5 కోట్ల ఆస్తికి వారసురాలు అయ్యింది. మరి, ఆ ఆస్తి తనకు దక్కిందా? ఆ ఏనుగు బాధ్యతలు ఎవరు చూస్తున్నారు?
బీహార్‌లోని జానీపూర్‌కు చెందిన మహమ్మద్ అక్తర్ ఇమామ్‌కు చిన్ననాటి నుంచే ప్రకృతి, వన్యప్రాణులంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆయన రెండు ఏనుగులను పెంచుకున్నాడు. వాటికి ‘మోతి’, ‘రాణి’ అని పేర్లు పెట్టుకున్నాడు. వాటిని ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవాడు. అవి కూడా ఆయనపై అదే స్థాయిలో ప్రేమ కురిపించేవి. తన తర్వాత ఆ ఏనుగుల సంరక్షణ బాధ్యత ఎవరు చూస్తారనే ప్రశ్న అక్తర్‌ను వేధించింది. సొంత కుటుంబసభ్యులే ఆ ఏనుగులకు శత్రువులుగా ఉండటం ఆయణ్ని మరింత కలవరానికి గురిచేసింది. వాటిని జంతువుల అక్రమ రవాణా ముఠాకు విక్రయించాలని కుటుంబసభ్యులు ప్రయత్నించారు.
ఏనుగుల విషయంలో అక్తర్‌కు అతడి భార్య, కుమారుడితో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో వాళ్ల నుంచి విడిపోయాడు. ఇదిలా ఉండగా.. ఒకసారి మోతిని ఓ మావటి తీసుకొని భోజ్‌పుర్ జిల్లాకు వెళ్లాడు. అక్కడ అది అస్వస్థతకు గురైంది. ఆ వార్త తెలియగానే అక్తర్ హుటాహుటిన అక్కడికి చేరుకొని ఏనుగుకు చికిత్స చేయించాడు. అక్కడే ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా.. మధ్య రాత్రి మోతి పెద్దంగా ఘీంకరిస్తూ అతడిని మేల్కొల్పింది. అక్తర్ నిద్రలేచేసరికి కిటికీ నుంచి ఓ వ్యక్తి అతడికి తుపాకీ గురిపెట్టి ఉన్నాడు. అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. ఏనుగే తనను కాపాడిందని అతడు చెప్పాడు.
ఈ ఘటన తర్వాత ఏనుగుల సంరక్షణ కోసం అక్తర్ ‘ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ యానిమల్ ట్రస్ట్’ను స్థాపించాడు. ఒకవేళ తాను చనిపోయినా ఏనుగుల మనుగడకు ఎలాంటి లోటు ఉండకూడదని భావించి తనకున్న రూ. 5 కోట్ల విలువైన ఆస్తిని వాటి పేరు మీద వీలునామా రాశాడు.
కుటుంబసభ్యులు, ఏనుగుల అక్రమ ముఠా సభ్యుల నుంచి ముప్పు ఉందని భావించిన అక్తర్.. అనూక్షణం భయంభయంగా గడిపాడు. ఇంతలో 2020లో కరోనా లాక్‌డౌన్ వచ్చింది. కొవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత అక్తర్ తన రెండు ఏనుగులను తీసుకొని ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు వచ్చాడు. పాట్నాకు అది 900 కి.మీ. దూరం.
2021లో అక్తర్ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, అతడు అప్పటికే అతడు వీలునామా రాశాడు. దీంతో ఆస్తి మొత్తం ఏనుగులకు దక్కింది. అక్తర్ మరణించిన తర్వాత ఆ ఏనుగుల సంరక్షణ బాధ్యతలను ఉత్తరాఖండ్ అటవీ అధికారులు ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తికి అప్పగించారు. ఇమ్రాన్ ఇప్పుడు అక్తర్ ఆశయం కోసం పని చేస్తున్నాడు. 35 ఏళ్ల మోతి గత నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. వయోభారం, అవయవాలన్నీ చెడిపోవడంతో నెల రోజుల పాటు ప్రాణాలతో పోరాడి మరణించింది.
ప్రస్తుతం రాణికి 25 ఏళ్లు. ఇప్పుడు అక్తర్ ఆస్తికి ఏకైక వారసురాలి ‘రాణి’నే. అయితే, ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది. ప్రస్తుతం రాణి రామ్‌నగర్ (ఉత్తరాఖండ్)లో ఉంటోంది. ఆస్తి పాట్నా (బీహార్)లో ఉంది. అక్తర్ స్థాపించిన ఫౌండేషన్ నడుస్తున్నప్పటికీ దానికి సరిపడా నిధులు అందడం లేదు. పాట్నాలో రాణి పేరిట ఉన్న ఆస్తి తనకు దక్కితేనే అక్తర్ ఆశయం నెరవేరుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa