రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్ ఎదుట రెండో రోజు మంగళవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టును 45. 72 మీటర్ల ఎత్తులో నిర్మించడం ద్వారా రాయలసీమ, సుజల స్రవంతి ద్వారా అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరందుతుందన్నారు. జిల్లాలోని అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండు చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా సమ్మర్ స్టోరేజీకి రూ. 650 కోట్లతో పనులు చేపట్టి మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాలకు సాగు, తాగునీరందించాలన్నారు. దీక్షల్లో జన సేన పార్టీ నాయకుడు శ్రీనివాస్, బీఎస్పీ నాయకుడు యుగంధర్, ఎమ్మా ర్పీఎస్ నాయకులు రామాంజనేయులు, మనోహర్, మహేష్, సీపీఐ నాయకుడు సిద్దిగాళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.