ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం అమరావతి నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిన ఆయన్ను క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో పార్టీ నుంచి వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన సోమవారం సాయంత్రం తన స్వగ్రామం మర్రిపాడు చేరుకున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను బయటకు వస్తే దిశ చట్టం కింద బొక్కలో వేయమని ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలను పైనుంచి ఆదేశించారట. మొదటి నుంచీ జగన్ వెంట తిరిగి, పార్టీ కోసం కత్తులు పట్టి, ప్రాణాన్ని పణంగా పెట్టి రాజశేఖర్‌రెడ్డి కుమారుడని అండగా నిలిచినందుకు మోసపోయా. నాకు దక్కే గౌరవం ఇదేనా? ఇది నా కర్మ. ఇదిగో చెంపలు వేసుకుంటున్నా. పార్టీ నాకు ద్రోహం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేనెవరి దగ్గరా చిల్లి గవ్వ కూడా తాకలేదు. నాకు అలాంటి అలవాటు లేదు. నా నియోజకవర్గంలో డబ్బుండే ధనవంతులు ఉన్నారు. ఈసారి వారికే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను అవమానపరుస్తున్నారు అని ఆవేదన వ్యక్త పరిచారు.