తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వంద సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశాలను నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానించింది. ఈ సమావేశాలు ఎలా, ఎక్కడ నిర్వహించాలో ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయన్నారు. గురువారం (ఈ నెల30) నుంచి మే 28వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీలోని 42 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. అండమాన్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న విదేశాల్లో కూడా సభలు జరుపుతారు. మాజీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారమిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల పనితీరు, ప్రధాన ప్రజా సమస్యలతో పాటు పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవంపై చర్చించారు. నాలుగు దశాబ్దాల టీడీపీ ఘన చరిత్రను ఇంటింటికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పొలిట్‌బ్యూరో తీర్మానం ఆమోదించింది.