అమలాపురం అల్లర్ల కేసుల ఉపసంహరణకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అమలాపురం ఘటనలతో సామాజిక విభేదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ చూపించారు. క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం సమావేశం అయ్యారు.. అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
తరతరాలుగా అందరూ అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు సీఎం జగన్. అక్కడే పుట్టి.. అక్కడే పెరిగారని.. అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు.. వాటిని మరిచిపోయి మునుపటిలా కలిసిమెలిసి జీవించాలన్నారు.. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. దీన్ని ఇలా లాగుతూ పోతే.. మనుషుల మధ్య దూరం పెరుగుతుందన్నారు. దీనివల్ల అందరూ నష్టపోతారని.. అందుకే అందరం కలిసి ఉండాలి, ఆప్యాయతతో ఉండాలన్నారు.
చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం, తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదాం అన్నారు. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం, అందర్నీ ఒకటి చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నామన్నారు. అందరికీ పార్టీలు చూడకుండా శాచురేషన్ బేసిస్ మీద పథకాలు అన్నీ ఇస్తున్నామని.. వాలంటీర్‌లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారన్నారు. వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయమన్నారు.
అర్హత ఉన్న వారికి ఏ పథకమైనా అందని పరిస్థితి ఉండకూడదనేది ప్రభుత్వ విధానమన్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి అన్నీ ఇస్తున్నామని.. పార్టీలు చూడకుండా జరగాల్సిన మంచి చేస్తున్నామన్నారు. రూ. 2 లక్షల కోట్ల డీబీటీ దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదని.. రూపాయి లంచం లేకుండా ఈ స్ధాయిలో ఎప్పుడూ జరగలేదన్నారు. టీడీపీ హాయంలో తన పాదయాత్రలో లోన్ ల గురించి ప్రస్తావన వచ్చింది అన్నారు.
గతంలో లోన్‌ల కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్ధిత ఉండేదని.. అవి కూడా అక్కడక్కడా అరకొర అందేవన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని.. లంచాలు లేని ఇంత మంచి వ్యవస్ధను తీసుకొచ్చారన్నారు. మంచి చేసే విషయంలో ఏం చూడకుండా చేస్తున్నామని.. ఇలాంటి వ్యవస్థ ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుందన్నారు. ఏ కారణం చేతనైనా ఎవరైనా మిస్ అయితే వారిని చేయి పట్టుకుని నడిపించడానికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు.
అమలాపురంలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి పినపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. భావోద్వేగాలతో మేం ఊహించని ఘటన జరిగిందని.. ఈ విషయంలో చొరవ తీసుకున్నదందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము వ్యక్తిగతంగా ఏదీ తీసుకోలేదని.. ఇప్పుడు కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నామన్నారు.