సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి ఢిల్లీకి వెళ్లడం లేదని, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కాళ్ల బేరం కోసమే వెళ్తున్నారని టీడీపీ ఎంపీ ఎంపీ రామ్మోహన్ ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పూర్తయ్యే సమయానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి ఢిల్లీకి వెళ్లడం లేదని, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కాళ్ల బేరం కోసమే వెళ్తున్నారని ఎంపీ రామ్మోహన్ ఆరోపించారు. తెలుగు జాతి పరువును ఢిల్లీలో తాకట్టు పెట్టేందుకే ఆయన వెళ్లారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ప్రపంచం గర్వపడేలా తెలుగుజాతిని నిలబెట్టే సత్తా ఒక్క తెలుగు దేశం పార్టీకే ఉందన్నారు. తెలంగాణ గాలిలో, నేలలో తెలుగుదేశం పార్టీ ఉందని.. ఏపీ, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు.
1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు దూసుకెళ్లినట్లుగానే.. తెలుగు దేశం పార్టీ కూడా దూసుకెళ్తోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో మాదిరిగా అమరావతికి పునాదులు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. 2024లో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఎంపీ రామ్మోహన్ అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన సీఎం జగన్.. ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారని దుయ్యబట్టారు. అందుకే, వైనాట్ పులివెందుల అని తాము సవాల్ విసిరామని చెప్పారు. రాష్ట్రంలో జీవో నంబర్ 1 తెచ్చి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.