ఏపీలో వైసీపీ సర్కార్ నూతన విధానం అమలులోకి తీుకురానున్నది. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే.. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో.. బుధవారం వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ సందర్భంగా కీలక సూచనలు చేశారు. జూన్‌లో ఖరీఫ్ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్న సీఎం.. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్.. ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్న అభిప్రాయపడ్డారు.
పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని.. అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్బీకేల ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయని జగన్‌కు వివరించారు. పత్తిలో 16 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9 శాతం దిగుబడులు పెరిగాయని వివరించారు. పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సమీక్ష సందర్భంగా.. రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇది యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. జులైలో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల.. రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున.. ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతోయయ ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీ చేస్తున్నామని అధికారులు వివరించారు.
బేరం కోసమే జగన్ ఢిల్లీకి... ఎంపీ రామ్మోహన్ నాయుడు