ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. అమృత్ పాల్ సింగ్ అతని సహాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్ మరోసారి పంజాబ్ పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా అమృత్ పాల్ పోలీసుల కంటపడ్డాడు. అతను తప్పించుకున్నా.. ఖలిస్థాన్ మద్దతుదారులైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమృతపాల్ సింగ్, అతని సహాయకులు వున్నారనే అనుమానంతో ఫగ్వారా నుంచి హోషియార్‌పూర్‌కు వస్తున్న తెల్లరంగు ఇన్నోవా కారును తాము వెంబడించామని పోలీసులు తెలిపారు. కానీ, పోలీసు చెక్ పోస్టు దాటుకొని వెళ్లిన కారు మెహతియానాలోని గురుద్వారా వద్ద ఆగిందన్నారు. నిందితులు కారును గురుద్వారా సమీపంలో వదిలి పారిపోయారని హోషియార్‌పూర్ సీఐడి అధికారులు తెలిపారు. పాపల్ ప్రీత్ తో పాటు మరో అనుచరుడితో కలిసి అమృత్ పాల్ తప్పించుకున్నాడని చెప్పారు.
వారి కోసం గాలించే క్రమంలో పోలీసులు అతని ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ అమృత్ పాల్ ఇన్నోవా కారును వెంబడించారు. ఈ ఇద్దరూ పంజాబ్‌కు చెందినవారు కాగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో నివసిస్తున్నారు. అమృత్ పాల్ కోసం పంజాబ్ పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కాగా, అమృత్ పాల్ కొన్ని రోజుల కిందట జలంధర్‌లోనూ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. అతను తన వేషాన్ని మారుస్తూ.. వేర్వేరు వాహనాల్లో ప్రయాణించడం పోలీసులుకు సవాల్ గా మారింది.