యూపీఐ పేమెంట్లకు ప్రతి ఒక్కరూ అలవాటు పడుతున్నారు. ప్రీ పెయిడ్ ఇన్ స్ట్రుమెంట్లు (వ్యాలెట్ తరహా, ముందస్తు లోడ్ చేసుకున్నవి) ద్వారా చేసే యూపీఐ లావాదేవీ విలువ రూ.2,000 మించితే 1.1 శాతం చార్జీ పడుతుంది. ఈ విషయాన్ని యూపీఐ ఆవిష్కర్త అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) ప్రకటించింది. తాజా నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
దీన్ని ఇంటర్ చార్జీ ఫీజుగా పేర్కొంది. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కొంత ఆదాయం సమకూరుతుందని తెలిపింది. యూపీఐ లావాదేవీలపై అధిక వ్యయాలతో సంబంధిత సంస్థలు నష్టపోతున్న నేపథ్యంలో ఇంటర్ చార్జీని ఎన్ పీసీఐ ప్రవేశపెట్టింది. ఈ చార్జీని తిరిగి 2023 సెప్టెంబర్ 30లోపు సమీక్షించనున్నట్టు తెలిపింది.
పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ కూడా ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్ల కిందకే వస్తాయి. రిటైల్ కస్టమర్లపై తాజా చార్జీల భారం పడదు. కస్టమర్ల నుంచి రూ.2,000కు పైగా పేమెంట్ ను వర్తకులు స్వీకరించినప్పుడు ఈ చార్జీ వారికి పడుతుంది. పేమెంట్ స్వీకరించిన వర్తకుడి బ్యాంక్ ఈ చార్జీని, చెల్లించిన వ్యక్తి బ్యాంక్ కు చెల్లిస్తుంది. అంటే ఈ కేసులో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంకు కొత్తగా ఆదాయం సమకూరనుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య యూపీఐ లావాదేవీల విలువ ఎంత ఉన్నా, వాటిపై ఎలాంటి చార్జీ ఇక ముందూ ఉండదు.