అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి బాలిక తన్వీ ఫ్లోరిడాలో తన్వీ సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అర్కాన్సాస్‌కు చెందిన తన్వీ(15) సుమారు రెండు నెలల క్రితం ఇంట్లోంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది. టెక్ రంగంలో లేఆఫ్స్ కారణంగా తన తల్లిదండ్రులు ఉద్యోగం కోల్పోతే భారత్‌కు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఆమె ఇల్లు వీడినట్టు అప్పట్లో మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
బాలిక చివరి సారిగా జనవరిలో కాన్వే జూనియర్ హైస్కూల్ సమీపంలో కనిపించింది. అక్కడి నుంచి కొన్ని మైళ్లు దూరం నడుచుకుంటూ వెళ్లిన ఆమె ఓ పాడుపడ్డ ఇంట్లో తలదాచుకుందని పోలీసులు చెప్పారు. ఆ తరువాత అక్కడి నుంచి ఫ్లోరిడా వెళ్లిందని పేర్కొన్నారు. తన్వీకి తరచుగా లైబ్రెరీకి వెళ్లే అలవాటు ఉందని, అదే చివరకు ఆమె ఆచూకీ లభించడంలో కీలకంగా మారిందని చెప్పారు. మార్చి 29న టంపాకు చెందిన ఓ వ్యక్తి నుంచి పోలీసులకు కీలక సమాచారం అందింది. తన్వీని తాను లైబ్రెరీలో చూసినట్టు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తోంది.