అమెరికాకు చెందిన అడల్ట్ కంటెంట్ మ్యాగిజైన్ ‘ప్లేబాయ్’ కవర్ పేజీపై ఫ్రాన్స్ మహిళా మంత్రి మార్లీనె షియప్పా ఫొటో ప్రచురించడం పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె వస్త్రధారణ తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మార్లీనెతో మాట్లాడిన ప్రధాని ఎలిజబెత్ బోర్న్.. ఆమెను మందలించారు. ‘మీ ప్రవర్తన సరైన రీతిలో లేదు’ అని ప్రధాని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మెక్రాన్ ప్రభుత్వంలో 40 ఏళ్ల మార్లీనే షియప్పా 2017 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె సామాజిక ఆర్థిక సంబంధాల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ప్లేబాయ్ మ్యాగిజైన్‌కు మంత్రి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫొటో షూట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. ఈ ఫొటో అశ్లీలంగా ఉండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కవర్‌పేజీపై ఫోటోనే కాదు.. ఆమె ఇంటర్వ్యూలో మహిళలు, స్వలింగ సంపర్కులు, అబార్షన్ హక్కుల గురించి మాట్లాడారు. దీనిపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. మార్లీనె మాత్రం తాను చేసిన పని సరైనదేనని సమర్దించుకున్నారు.