కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని.. కేపీసీసీ చీఫ్ డీ.కే. శివకుమార్ స్పష్టం చేశారు. విధేయత, కష్టానికి హైకమాండ్ ప్రతిఫలం ఇస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ నేతల మధ్య పోటీ ఉందన్నది ఊహాగానాలేనని ఆయన అభిప్రాయపడ్డారు.
'పార్టీ అగ్ర నాయకత్వం విధేయత, కృషికి ప్రతిఫలం ఇస్తుందనడంలో సందేహం లేదు. నేను పార్టీకి నమ్మకమైన కార్యకర్తను. పార్టీకి ద్రోహం చేయలేదు. కష్ట సమయాల్లో నేను పార్టీకి అండగా నిలిచాను. నేను రాజకీయాల్లో అత్యంత కచ్చితంగా ఉన్నాను. అందుకు ప్రతిఫలం ఇవ్వడానికి హైకమాండ్ సిద్ధంగా ఉంటుంది' అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తన ధ్యేయమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే నాయకత్వ బాధ్యతలు చేపట్టానని.. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ చాలా బలంగా ఉందని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో పార్టీని బతికించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. నిద్ర, తిండి లేకుండా రాష్ట్రంలో ప్రతి మూలకు తిరిగాను. పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాను. విజయం సాధించబోతున్నాం. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వ్యవస్థను నిర్మించడంలో విజయం సాధించాం' అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
'ముఖ్యమంత్రి పదవి విషయంలో.. నాకు, సిద్ధరామయ్యకు మధ్య పోటీ లేదు. ఇద్దరం పార్టీ కోసం పనిచేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోంది' అని డీకే శివకుమార్ ఫైర్ అయ్యారు.
'మీడియాలోని ఒక వర్గం కూడా తప్పుడు పుకార్లను ప్రచారం చేస్తోంది. ఇది మా ఐక్యతను విచ్ఛిన్నం చేసే ఎత్తుగడ. బీజేపీని ఓడించి కర్ణాటక పరువు నిలబెట్టాలన్న లక్ష్యం నెరవేరకుండా ఎవరూ ఆపలేరు. జేడీఎస్‌తో పొత్తు ప్రశ్నే లేదు. కాంగ్రెస్ పార్టీ 140 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. మాకు ఎవరి పొత్తు అవసరం లేదు' అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
'బీజేపీతో చేతులు కలిపి జేడీఎస్ రెండు సార్లు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది. హెచ్‌డీ కుమారస్వామి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను.. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన తీరు తనను తీవ్రంగా బాధించింది. దీన్నిబట్టి బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది అని అర్థం చేసుకోవచ్చు' అని డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa